చిట్టి చేప

 ఒక రోజు జాలరికి సముద్రంలో ఒక చిన్న చేప దొరుకుతుంది. ఆ చేప బంగారు-ఆకుపచ్చ వర్ణంలో మెరుస్తుంది.

'అరె భలే వింతగా ఉంది! అరుదైన చేపలా ఉంది, ఎక్కువ ధర పలుకుతుంది.' అనుకుని సంబరపడిపోయాడు.

కానీ ఆ చేప మాట్లాడటం మొదలెడుతుంది. "ఓయ్! నన్ను ఎందుకు పట్టుకున్నావు?"

ఆ మాటలకి అవాక్కయ్యాడు జాలరి.

"అదేంటి, తినడానికి"

"మమ్మల్ని తింటారా?"

"హా! మేము చాలా మంది తింటాం. అదే మా పని. ఈ విషయం మీకు మీ అమ్మానాన్నలు చెప్పలేదా?"

"లేదే! మేము చాలా దిగువన ఉంటాం. ఇంత పైకి వచ్చిందే లేదు. అయితే ఇక్కడ ఉన్న చేపల్ని మీరు పట్టుకుని తినేస్తారా?"

"అన్నిటినీ కాదు. ఏవి దొరికిపోతే వాటిని."

"ఎందుకు మా వాళ్ళని అలా బాధించడం?"

"మాకు ఇవే అలవాటు. పైగా కొన్నిటివల్ల ఆరోగ్యం కూడానూ.."

ఆ చేప కొంతసేపు ఆలోచించి, "అయితే మీరు ఎప్పుడూ వాసేరు మెక్కని తినలేదా?"

"వాసేరు మొక్కా? అదేంటి?"

"అయ్యో, మేమంతా అదే తింటాం. చాలా బావుంటుంది. ఆరోగ్యం కూడాను. నేను కావస్తే వాటి ఆకుల్ని తెచ్చి ఇస్తాను. మీరు మా చేపల్ని వేటాడటం మానేస్తారా?"

జాలరి ఆలోచించాడు. "సరే ముందు నువ్వు తెచ్చి ఇవ్వి. అప్పుడు చూద్దాం."

చేప సముద్రంలోకి వెళ్ళి చాలా సేపటి తర్వాత కొన్ని ఆకుల్ని ఇస్తుంది. "ఈ రోజు వీటిని ప్రయత్నించి చూడు."

ఆ రోజుకి వాటిని కూరగా వండుకుంటాడు. మొదటి ముద్ద నోటికి తగలగానే అమృతంలా అనిపిస్తుంది. నమ్మలేకపోతాడు. 'ఆ చేప చెప్పింది నిజమే! చాలా బావుంది.' అని అనుకుంటాడు.

***

మరునాడు ఉదయమే సముద్రంలోకి వెళ్ళినపుడు ఆ చేప కనిపిస్తుంది.

"నువ్విచ్చిన ఆకులు చాలా బావున్నాయి. ఇంకా ఉన్నాయా? నాకు రోజు వాటిని ఇస్తావా? వాటి గింజలు ఇవ్వొచ్చుగా, మేమే ఇక్కడ పెంచుకుంటాం?"

"లేదు అవి సముద్రం అడుగున మాత్రమే పెరుగుతాయి. కానీ నేను నీకు అవి రోజూ ఇస్తాను. నీకు మాత్రమే కాదు, మీ వాళ్ళకి సరిపడా ఇస్తాను. కానీ ఒక షరతు."

"ఏంటది?"

"ఇకపై ఈ సముద్రంలో మీ వాళ్ళు ఎవరూ వేటాడకూడదు. ఇక్కడ ఒక్క చేప చనిపోయినా నేను ఆ ఆకుల్ని ఇవ్వను."

"అవునా! కానీ అది చాలా పెద్ద పని! మా వాళ్ళందరినీ ఒప్పించాలి. సమయం కావాలి. ఎంత అంటే నేను కూడా చెప్పలేను. కానీ నేను తప్పక ప్రయత్నిస్తాను. ఏదోక రోజు నీకు నేను మాట ఇస్తాను, ఆ తర్వాత నుండి ఒక్క చేపకి కూడా హాని తలపెట్టం. అందరినీ మార్చాలి అంటే ఈరోజు నుంచి ఎక్కువ ఆకులు ఇవ్వాల్సివస్తుంది. అందరినీ వీలైనంత తొందరగా మార్చే బూచీ నాది!" అని జాలరి మాట ఇస్తాడు.

సరేనని ఆ చేప బోలుడు ఆకులని తెస్తుంది. వాటినన్నింటినీ తీసుకుని ఆనందంగా ఇంటికెళ్తాడు.

ఆ మరునాడే ఊర్లో అందరికీ వాసేరు మొక్క గురించి ప్రచారం మొదలెడతాడు. గ్రామపెద్ద సాయంతో అందరికీ ఆ ఆకుల్ని ఇచ్చి ప్రయత్నించమంటాడు. చాలా మందికి నచ్చుతుంది.

అలా నెమ్మదిగా, కొన్ని నెలలకి అందరూ చేపల్ని పట్టడం మానేస్తారు. పండగలకీ, పెళ్ళిళ్ళకీ వాసేరు మొక్కే ప్రధాన ఆకర్షణ అయ్యింది.

***

ఇలా కొన్ని రోజులు అందరూ సంతోషంగా ఉన్నారు. చేపల్ని ఎవరూ వేటాడట్లేదు. కానీ ఉన్నట్టుండి వాసేరు ఆకుల్ని చేపలు తేవడం మానేసాయి. అందరూ ఆశ్చర్యపడ్డారు. 

మన జాలరి తన చిట్టి చేపను పిలిచాడు. "ఏమైంది చేపా? మా మొక్కలు ఏవి?"

"మీరు మాట తప్పారు. ఒక చేప చనిపోయింది."

"అది అసాధ్యం. మా వాళ్ళు ఎవరూ చేపల్ని వేటాడట్లేదు."

"అవన్నీ మాకు తెలీదు. మీరు మాట తప్పారు. మీకు ఇకపై ఆకులు ఇచ్చేది లేదు."

"ఏమి జరిగిందో మమ్మల్ని తెలుసుకోని - కొంత సమయం ఇవ్వు"

"లేదు." అని తేల్చిచెప్తుంది చేప.

జాలరికి కోపం వస్తుంది. "అలా అయితే మేము నిజంగానే చేపల వేట మొదలెట్టాల్సివస్తుంది."

"అదే జరిగితే, మీకు ఎప్పటికీ ఆ మొక్క దొరకదు. ఇకపై మేము ఎప్పట్టికీ మీతో మాట్లాడం కూడా." అని తేల్చిచెప్తుంది చేప.

అంతే. అప్పటిదాకా చేపలకి, మనుషులకి ఉన్న సంబంధం తెగిపోతుంది. అందరూ చేపవేట తిరిగి మొదలెట్టాలని నిర్ణయించుకుంటారు. ఆ విషయమై గ్రామపెద్దతో సమావేశం అవుతారు.

అప్పుడు గ్రామపెద్ద - "ఈ విధంగా జరగడం చాలా దురదృష్టం. తప్పని పరిస్థితి కాబట్టి మంచి రోజు చూసుకుని మనం వేటని తిరిగి ప్రారంభిద్దాం."

"మరి జనాలకి ఏం చెప్దాం?"

"నేను అలోచించి నిర్ణయం తీసుకుంటా." అని చెప్పడంతో అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు.

***

కొన్ని రోజులకి సంతలో చేపలను అమ్మడం మొదలెడతారు.

ఒకతను - "ఆ మొక్క ఉండేదిగా! ఏమైంది? మళ్ళీ చేపలనే అమ్ముతున్నారు?"

"అదేంలేదు.. ఆ వాసేరు మొక్క చాలా పవిత్రమైనది అట. దానికి వెయ్యి సంవత్సరాలకి ఒక్క సారి మాత్రమే ఆకు పడుతుందిట. మనం చాలా అదృష్టవంతులం అని చెప్పుకుంటున్నారు. ఇంకో వెయ్యేళ్ళ వరకూ ఎవరూ దానిని తినలేరుట." అని జవాబిచ్చాడు అటువైపు వెళ్తున్న వేరే అతను.

"ఓహో అవునా! చాలా వింతగా ఉంది. పోనీలే, ఏమాటకామాట, ఆ మొక్కతో పులుసు పెట్టుకుంటే అబ్బో! నిజంగా మన అదృష్టమే!"


భవిష్యత్తులోనైనా చేపల కోపం తగ్గి ఆ వాసేరు మొక్క రుచిని అందరూ ఆస్వాదించాలని కోరుకుందదాం..!







 

Comments

Popular posts from this blog

పావు జీవితపు శుభాకాంక్షలు!

నేను - వాళ్ళు