రాజు-రాణి-పక్షి
ఒక అడవిలో ఒక రాజు, రాణి ఉండేవారు. రాణికి ఒకరోజు అడవిని దాటి బయటకి వళ్ళాలనిపించి, రాజుని ఇలా అడిగింది -
"మనం ఎక్కడికైనా వెళ్దాం రాజా!"
"ఎక్కడికి రాణి?"
"ఎటైనా పర్లేదు. ఇక్కడే ఉండి చిరాకు వస్తోంది."
"ఏదైనా ఒకటే రాణి. ఇక్కడ లేని చెట్టా, చేమా! ఇవే జలపాతాలుూ, సరస్సులూనూ..!"
రాణి దిగాలుగా మొహం పెట్టి అలా నడుచుకుంటూ నది దగ్గరకు వెళ్ళింది. అక్కడ నీటిలో తన ప్రతిబింబంతో పాటు ఆకాశం కనిపించింది.
***
“ఆకాశాన్ని చూడటానికి వెళ్దాం రాజా!” అంది రాణి, ఎంతో ఉత్సాహంగా.
“ఆకాశంలో ఏముంటుంది రాణి? అంతా ఖాళీగా బోసి గానూ!”
“ఏమో ఎవరికి తెలుసు? బావుంటుందేమోగా!”
“ఆకాశంలో ఎలా తిరుగుతావు రాణి? ఇక్కడ అయితే నడవడానికి నేల ఉంది. మరి అక్కడ?”
ఈ ప్రశ్నకి రాణి దగ్గర సమాధానం లేదాయె!
మరి ప్రయాణం ఎలా అని దిగాలు పడింది.
అదే రోజు రాత్రి తన పెరట్లో తిరుగుతుండగా రెండు పక్షుల మాటలు రాణి చెవులో పడ్డాయి.
“ఈ రోజు చూసావా ఎంత బాగా ఆకాశంలో తిరిగామో”
“హా అవును! అందరికీ దొరకదులే ఇలాంటి అదృష్టం. ఆకాశంలో ఎగరడానికి రహస్యం అందరికీ తెలీదు కదా!”
‘ఏంటి రహస్యమా!’ అని అనుకుంది రాణి.
వెంటనే ఆ పక్షుల దగ్గరకి వెళ్ళి - "నాకు కూడా ఆ రహస్యాన్ని చెప్పరూ..!?" అని అడిగింది.
“మీకు ఏం సాయం కావాలన్నా చేస్తాను.” అని రాణి అంది.
“సరే! ఒక మంత్రం ఉంది. అది సూర్యోదయం అయినప్పుడు చెప్తే ఆకాశంలోకి ఎగరగలవు”
“ఏంటది?”
“జాగ్రత్తగా విను - పరారా-రాపర-రారాప-పాపార-రరపాపా-పపారాప”
“అవునా! అంతేనా!”
“హా అంతే. సమంగా గుర్తుందా ?”
“హా! అస్సలు మర్చిపోను. చాలా ధన్యవాదాలు పక్షుల్లారా!” అని ఆనందంగా లోపలకెళ్తుంది రాణి.
***
"రాజా! ఆకాశానికి వెళ్ళే మార్గం దొరికింది!"
"అవునా.. ఎలా?"
"అది ఒక మంత్రం! సుర్యోదయ సమయంలో చెప్తే చాలు, ఆకాశంలో విహరించొచ్చుట!"
"ఓహో! నీకు ఎలా తెలిసింది?"
"మన పెరట్లో పక్షులు మాట్లాడుకుంటే విన్నాను."
"అవునా"
"హా! రేపు ఉదయమే సిద్ధంగా ఉండండి! మనం వెళ్దాం."
"అయ్యో రేపు ఉదయమా!"
"ఏమైంది?"
"ఈ రోజు నేను బాగా అలిసిపోయాను. ఎల్లుండి వెళ్దామా? ఏముంది ఒక్క రోజేగా.. ఎలానో మంత్రం మన దగ్గరే ఉందిగా..!"
"సరే" అని ఒప్పుకుంది రాణి.
తర్వాత రోజు రాత్రి - "రాజా! రేపు వెళ్దామా?"
"నేను సిద్ధమే గాని, నువ్వు చూడు ఎలా ఉన్నావో! సమంగా నిద్రపోలేదా? ఇలా వెళ్తే ఎలా? ఆకాశంలో ఎవరైనా కనిపిస్తేనో?"
తర్వాత రోజు రాత్రి - "రేపు వెళ్దామా రాజా?"
"రేపు అమావాస్య"
"మనం వెళ్ళేది పగలు కదా!"
"అయినా వద్దు."
తర్వాత రోజు -
"రేపు ఒక ముఖ్యమైన సమావేశం ఉంది."
తర్వాత రోజు -
"మీ అక్క వాళ్ళు వస్తున్నారు కదా! మర్చిపోయావా?"
ఇలా కొన్ని రోజులు గడచాక మొత్తానికి ఇద్దరికీ కుదురుతుంది.
రాజు-రాణి సూర్యోదయాన ఆ మంత్రం చదువుతారు. వెంటనే గాల్లోకి వెళ్ళటం మొదలెడతారు.
రాజు-రాణి అస్సలు నమ్మలేకపోతారు.
అలా ఆనందంగా ఆకాశంలోకి అలా పైపైకి వెళ్తూ ఉండంగా రాజు -
"రాణి - అటు చూడు!" అని కొంచెం పైకి చూపిస్తాడు.
వెంటనే రాజు చూపించిన వైపు రాణి చూడగా - తన తమ్ముడు!
"అక్కా!"
"తమ్ముడు నువ్వేంటి ఇక్కడ?" గత కొన్ని రోజులుగా కనిపించకపోయిన తన తమ్ముడుని చూసి అడిగింది రాణి.
"నువ్వేంటక్కా ఇక్కడున్నావు? నువ్వు కూడా ఆ పక్షుల మంత్రంతో వచ్చావా ఏమిటి?"
"హా అవునురా! ఏమైంది?"
"అయ్యో ఇరుక్కుపోయారే ఇద్దరూనూ!"
"ఏమైందిరా, సమంగా చెప్పు" అని రాజు దబాయించేటప్పటికి నిట్టూర్పుతో ఇలా అన్నాడు -
"ఇది గమనించారా? ఆ పక్షులు ఆకాశంలోకి ఎగిరే మంత్రం చెప్పాయి గాని, తిరిగి నేల మీదకి దిగే మంత్రం చెప్పాయా?"
ఇది విన్న రాణి అవాక్కయ్యింది. "నిజమే! అలాంటిదేమి చెప్పలేదు."
"అయ్యో అవునా! నేను కూడా పట్టించుకోలేదే!" అని ఘొల్లుమన్నాడు రాజు.
"అదే మరి! అందుకే ఇక్కడ నాలాగ చాలా మంది చిక్కుకుపోయారు. ఇప్పుడు మీరు."
"ఇంకా ఉన్నారా? ఎవరు? ఎక్కడ ఉన్నారు? ఎవరూ కనిపించట్లేదే?"
ఇలా అనేలోపే రాణి తన తమ్ముడి నుండి దూరంగా వెళ్తుండటం గమనించింది. రాజు మరియు రాణి పైకి వెళుతూనే ఉన్నారు.
"అయ్యో ఇదేంటి ఇలా ఎంత సేపు పైకి వెళుతూ ఉంటాం? ఇక ఆగేది ఎపుడు?"
రాణి వాళ్ళ తమ్ముడు ఇలా అరిచాడు - "ఆ మంత్రం లోనే ఏదో కిటుకు ఉంది. దాన్ని బట్టే....." ఏదో చెప్తున్నాడు. కానీ సమంగా వినపడట్లేదు.
"అరెరె వినిపించట్లేదే!"
"నేను చెప్తాను" అని వాళ్ళ దగ్గరికి వచ్చింది ఓ పక్షి.
***
"పేరుకి ఏదో ఆకాశంలో విహరిస్తున్నాం గానీ, మాకు ఆకాశం అంతా చాలా బోసిగా అనిపించింది. అందుకే ఆకాశాన్ని అలంకరిద్దాం అనుకున్నాం. కొంతకాలం కిందట మాకు ఒక గ్రంధం దొరికింది. అందులో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం ద్వారా ఎవ్వరినైనా భూమి నుంచి అనుకున్న దిక్కుకి, అనుకున్నంత దూరంగా పంపిచొచ్చు. అందులో భాగంగానే మాకు మీరు చిక్కారు."
"అంటే మేము ఎప్పటికీ కిందకీ వెళ్ళలేమా?"
"లేదు."
"దయచేసి అలా అనకు. నీకు ఏమి కావాలన్నా ఇస్తాను." అన్నాడు రాజు.
"దురదృష్టం కొద్దీ నేను ఏమీ చెయ్యలేను. ఆ గ్రంధంలో కూడా దీనికి పరిష్కారం లేదు."
"ఏంటి!?" అన్నారు రాజు-రాణి ఏక గొంతుతో.
"అయ్యో ఎందుకు అంత బాధ పడతారు? ఇది మంచి విషయంగా భావించండి. మీరు ఏం పనులు చెయ్యనక్కర్లేదు, పైగా మీరు ఎక్కడ ఉన్నా భూమిని మరియు దాని పైన జరిగే విషయాలన్నిటనీ చాలా క్షుణ్ణంగా పరిశీలించొచ్చు. కొన్ని కోట్ల ఏళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. మాకు ఆకాశం బోసి గా ఉండదు. ఇద్దరికీ మంచేగా!"
"ఒక నిమిషం.. ఈ ప్రకాశవంతంగా ఉండటం ఏమిటి? అది కూడా 'కొన్ని' కోట్లా ఏళ్ళా? తర్వాత ఏమవుతుంది?" అని అడిగింది రాణి.
"ఏమో! నాకేం తెలుసు? అ... సరే నేను వెళ్ళాలి. మీరు ఇంకా చాలా దూరం వెళ్ళాలి అనుకుంటా. జాగ్రత్త! మిమ్మల్ని ఎప్పటకీ మేము మర్చిపోము. ధన్యవాదాలు!" అని చెప్పి అక్కడినుండి తుర్రుమంది పక్షి.
రాజు-రాణి అలా పైపైకి వెళ్తూ కొంతసేపటికి ఆగారు.
"ఇప్పుడు మనం ఏం చెయ్యాలి" అని రాజు రాణీని అడిగాడు.
"ఏం లేదు. బహుశా భామిలో ఉన్న మన వాళ్ళని, ఇక్కడికి వచ్చే మిగిలిన వాళ్ళని చూడటమే ఇంక" అని నిట్టూర్పుని విడిచింది.
అలా కొన్నాళ్ళకి అకాశం అంతా నక్షత్రాలలో నిండిపోయింది.
***
Comments
Post a Comment