రాజు - రాజు
ఓ రోజున ఇంటి నుండి పాఠశాలకి వెళ్తుండగా ఓ చెట్టు దగ్గర ఓ పెద్దాయన కనిపించాడు.
"ఏం రాజు ఎలా ఉన్నావు?" అని నవ్వుతూ అడిగాడు.
నేను తనని ఎప్పుడూ చూసింది లేదు. "ఎవరు మీరు?" అని అడిగాను.
"తర్వాత చెప్తా గాని, తెలుగు పుస్తకం మర్చిపోయావు చూసుకో!"
ఇది వినగానే అవాక్కయ్యాను. పుస్తకాలను సరిచూసుకున్నాను. నిజమే! తెలుగు పుస్తకాన్ని మర్చిపోయాను.
"నీకెలా తెలిసింది?"
"అది తర్వాత చెప్తా గాని, నువ్వు ఆ పుస్తకాన్ని పెట్టుకుని వెళ్ళు - బడికి ఆలస్యం అయ్యేలా ఉంది!"
నేను ఇంటికెళ్ళి తిరిగి వచ్చేలోపు చెట్టు కింద పెద్దాయన కనిపించలేదు.
కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఆ పెద్దాయన కనిపించాడు.
"ఓయ్! అసలు నువ్వు ఎవరు? అలా కనిపించి ఇలా మాయమయ్యావు? నీ గురించి మా వాళ్ళకి చెప్తే ఎవరూ నమ్మాలేదు. నీ పేరేమిటి? ఊరేంటి?"
"ఎవరూ నమ్మాలేదా?"
"అహా.."
"సోము నమ్మాడుగా!"
"ఆ.. అది.. నీకు ఎలా.." అని తడబడ్డాను.
ఆ పెద్దాయన నవ్వుతూ, "మనల్ని ఎవరూ నమ్మినా నమ్మకపోయినా - మన వాళ్ళు, మనం అనుకున్న వాళ్ళు నమ్మితే చాలు. నాది ఈ ఊరు కాదు. కాని ఇదివరకు ఇక్కడే ఉండేవాడిని. మీ ఇంటికి దగ్గరగా. అందుకని అప్పుడప్పుడూ వస్తూ ఉంటా."
"ఓహో అవునా.."
"అవును. నా పేరు - రాజు."
***
నిజానికి నా పేరు చెప్పాలి అనుకోలేదు. ఒకవేళ పసిగట్టేస్తే!? కానీ తప్పలేదు. నా గురించి ఇంకా ప్రశ్నలు, సందేహాలు రాకుండా ఉండాలంటే తన దృష్టిని మళ్ళించాలి.
"ఏంటి! నీ పేరు కూడా రాజు ఏనా!? భలే వింతగా ఉందే!" అని గట్టిగా నవ్వాడు. నేను ఊపిరి పీల్చుకున్నా.
అవమానాలు, అనుమానాలు అనేవి వయసుతో నేర్చుకునే జబ్బులు - చిన్న వాళ్ళకు ఇవేమీ తెలీవు. అర్థంకావు కూడా.
"హా, నా పేరు కూడా రాజే! ఇంగో ఈ విషయం ఎవరకీ చెప్పకు - బదులుగా నేను నీకు సాయం చేస్తూ ఉంటా" అని చెప్పా.
కొంత సేపు ఆలోచించి "సరే" అని హామి ఇచ్చాడు.
***
బడి నుంచి కోపంగా ఇంటికి వస్తుండగా మళ్ళీ పెద్దాయన ఎదురుపడ్డాడు.
"ఏం రాజు, ఏమైంది? మొహం అలా ముడుచుకుపోయింది?"
"ఓహో నువ్వా! నువ్వే చెప్పు నాకేమైందో" అని అన్నాను కోపంగా.
పెద్దాయన నవ్వుతూ - "మాస్టరు తిట్టాడు కదూ!"
"హా! అందరి ముందూను. తెలుసా!"
"మరి బాధగా లేదా?"
"ఎందుకు ఉండదూ! కోపంగా కూడా ఉంది."
"బాధ అంటున్నావు.. ఏడుపు రావట్లేదా?"
"అబ్బాయిలు ఏడవరు. అది అమ్మాయిలు చేసే పని."
పెద్దాయన నవ్వుతూ, "అయ్యో రాజు.. నీకో రహస్యం చెప్పనా! ఇలా దగ్గరకి రా.." అని సైగ చేసాడు. "ఏడుపు చాలా ఆరోగ్యకరం. నీకు ఇంకోటి చెప్పనా.. మంచిగా ఏడిస్తే చాలా హాయిగా నిద్రపడుతుంది."
"ఏంటి అవునా..!"
"హా! నిజం..!"
"మరి నాకిప్పుడు ఏడుపు పోయిందే! ఎలా?"
"హహ సరేలే, ఇప్పుడు వద్దులే, వచ్చేసారి ప్రయత్నించు చూడు. మర్చిపోకు.."
"సరే."
***
ఆ రోజు తనకు నేను రెండు విషయాలు చెప్దాం అనుకున్నా. ఒకటి చెప్పాను. ఇంకోటి - కోపాన్ని అదుపులో పెట్టుకోవడం గురించి చెప్పాల్సింది.
నిజానికి ఇది ఎలా పనిచేస్తుందో నాకు కూడా సమంగా తెలీదు. ఎప్పటిలానే రాత్రి పడుకున్న నేను ఉన్నట్టుండి ఒకరోజు పొద్దున లేచేటప్పటికి నా సొంతూరిలో ఉన్నాను. అయోమయంగా అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక్కసారి నన్ను నేను చూసుకున్నాను - అద్దంలో కాదు, కాలంలో - నా చిన్నప్పటి నన్ను చూసాను. ఏమీ అర్థం కాలేదు. కల అనుకున్నాను. భ్రమ అనుకున్నాను. కానీ నిజంలానే అనిపించింది. తరువాత కొంతసేపటికి మా ఇంట్లో ఎప్పటిలానే నిద్ర లేచాను.
ఇది అంతా పెద్ద కల అనుకుని వదిలేసాక మరలా రెండోసారి నా సొంతూరిలో మేలుకున్నాను. ఇక మూడవసారికి అలవాటు అయిపోయింది. అప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది - నా చిన్నప్పుడు ఒక పెద్దాయన కనిపించి తెలుగు పుస్తకం మర్చిపోయానని చెప్పడం. అది మరెవరో కాదు నేనే అని అప్పుడు అర్థమైంది.
నాకు జరుగుతున్న ఈ విషయాన్ని చెప్పుకోడానికి ఎవ్వరూ లేరు. చెప్పినా నమ్మే వాళ్ళూ లేరు. ఇది ఒక సమస్యగా కాకుండా నా తప్పులు సరిదిద్దుకునేందుకు వచ్చిన అవకాశంగా భావించడం మొదలుపెట్టాను.
నేను గమనించినది ఏమిటంటే - నా చిన్నప్పుడు నాకు ఇలాంటి సంఘటన ఒకసారే జరిగింది. కానీ, నేను మాత్రం ఈ చిన్న రాజుకి చాలా సార్లు కనిపిస్తున్నాను. కానీ ఎప్పుడు నేను కనిపిస్తానో, ఎప్పుడు మాయమైపోతానో ఇంకా తెలీదు - ఎప్పుడు ఆఖరో కూడా తెలీదు. అందుకే మొన్న కోపం గురించి కూడా చెప్దాం అనుకున్నా. కానీ ఒకేసారి అన్ని విషయాలను బుర్రలోకి ఎక్కించుకోలేడేమో అని తరువాత చెప్దామనుకున్నా. కానీ తరువాత నేను కనిపించలేదు. మరలా కనిపించడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఈ లోపల జరగాల్సిన అనర్థం జరిగిపోయింది.
***
ఆ రోజు ఒక గొడవలో ఉన్నాను - కళాశాలలో సోముని కొట్టినవాడిని చితకబాదుతున్నాను. వాడిని కొడుతుండగా నా చేతిలోంచి జారుకున్నాడు. తన వెనకాలే పరిగెడుతున్నాను.
అప్పుడు నా కనుసన్నల్లోంచి పెద్దాయనని చూసి ఆగాను. చాలా ఏళ్ళ తరువాత కనిపించాడు - జుట్టు మొత్తం తెల్లగా అయిపోయి - కాస్త బలహీనపడ్డాడు.
"వద్దు రాజు. ఇది నీకు మంచిది కాదు."
"ఏంటి అలా మాట్లాడుతున్నావు? వాడు సోముని ఏం చేసాడో తెలుసా?"
"తెలుసు. కానీ, ఆ సమస్యని పరిష్కరించే పద్ధతి ఇది కాదు. దీని వల్ల సమస్య మరింత పెద్దదవుతుంది. తర్వాత బాధపడతావు."
ఆవేశంలో వినలేదు. కానీ తను చెప్పింది నిజం. గొడవ అక్కడితో ఆగలేదు - నన్ను జైలుకి తీసుకెళ్ళి, శిక్ష వేయించేదాకా ఆగలేదు. కోపం వల్ల నష్టం, సహనం యొక్క విలువ తెలిసొచ్చేదాకా ఆగలేదు.
జైలు నుంచి బయటకు వచ్చి, ఊరు మారి, వాతావరణం మారి, గతం సలుపకుండా ఉండటానికి చాలానే సమయం పట్టింది. అప్పుడే నాకు గీత పరిచయమయ్యింది. ఆ పరిచయం ఇష్టంగా మారటానికి ఇంకొంత సమయం పట్టింది. అప్పుడు తను మళ్ళీ కనిపించాడు.
***
"ఒకటి చెప్పు, గీత అంటే ఇష్టమా?"
"చాలా.."
ఇది నేను ఊహించినదే. గీత అంటే ఎంత ఇష్టమో తను నాకు చెప్పకపోయినా నాకు తెలుసు. "మరి తనకి నీ ఇష్టం గురించి తెలుసా?"
"లేదు."
"మరి చెప్పి చూడొచ్చుగా.."
"భయంగా ఉంది."
అవును. భయపడ్డాను. నా గతం గురించి. నేను జైలుకి వెళ్ళానని తెలిస్తే ఎక్కడ ఛీదరించుకుంటుందో అని. కానీ గీత అలాంటి అమ్మాయి కాదని ఆలస్యంగా తెలిసింది. "నా సలహా వింటావా.."
"హా.."
"గతాలు అందరికీ ఉంటాయి. నువ్వు చూస్తున్న గీత నీకు తెలిసిన గీత మాత్రమే. నీకు తెలియని గీత కూడా ఉంటుందిగా. గీత గురించి నీకు పూర్తిగా తెలియాలంటే, అందులో భాగంగా నీ గురించి పూర్తిగా గీతకు తెలియాలిగా. కాబట్టి విషయాన్ని అర్థయ్యేలా చెప్పే ప్రయత్నం చెయ్యి."
"మరి గీత సమంగా అర్థం చేసుకోకపోతే?"
"హా, ఆ అవకాశం కూడా లేకపోలేదు - ఈ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే. దీని వల్ల మీరిద్దరూ దూరమవ్వొచ్చు. కానీ దగ్గర కూడా అవ్వొచ్చుగా. ఆలోచించు. ఒకవేళ తను నిన్ను నొప్పిస్తే, బాధపడు. ఇంచక్కా ఏడు. గుర్తుందిగా-"
"హా! గుర్తుందిలే" అని ఇద్దరూ నవ్వుకున్నారు.
మరుసటి రోజే గీతకు తన గతాన్ని మరియు తన మీద ఇష్టాన్ని చెప్తానన్నాడు. కానీ ఏమైందో తెలుసుకునేలోపే నేను మరలా నా యధాజీవితానికి వచ్చేసాను. మరలా కొన్నేళ్ళకు కలిసాను.
***
"ఎలా ఉన్నావు రాజు?" అని తెలిసిన గొంతులాగ వినిపిస్తే అటుగా చూసాను. పెద్దాయన - ఇంకాస్త పెద్దగా అయ్యాడు.
"ఓయ్ పెద్దాయన - ఏంటి ఎక్కడికి వెళ్ళావు? ఎలా ఉన్నావు?"
"హా బావున్నాను. నువ్వు ఎలా ఉన్నావు?"
"బావున్నాను. పద మన ఇంటికి వెళ్దాం."
"ఏంటి సొంతిల్లు కొనేశావా?"
"మన సొంతవాళ్ళు ఎక్కడ ఉంటే అదే మన ఇల్లు అంతే!"
"అబ్బో! సరే పద వెళ్దాం"
పెద్దాయనని ఇంటికి తీసుకువచ్చేసరికి గీత ఇంట్లోనే ఉంది. "ఇంగో గీత, ఎవరు వచ్చారో చూడు - పెద్దాయన అని చెప్తూవుండేవాడ్ని కదా!"
"హా.. అది మీరేనా! రండి రండి.." అని లోపలికి తీసుకువచ్చింది.
"ఏం తీసుకుంటారు? కాఫీ.. టీ.."
"అయ్యో నీకు ఎందుకమ్మా శ్రమ.. అసలే ఒట్టిమనిషివి కూడా కాదూ!"
"తనకి ఎందుకు శ్రమ పెద్దాయన, నేను ఉన్నాగా, నేను చేసి తెస్తాను." అని బదులిచ్చాను.
"ఓహో, అలా అయితే ఒక మాంచి కాఫీ పట్టుకురా."
"హహ సరే"
నేను కాఫీ తెచ్చేటప్పటికి గీత పెద్దాయన మాట్లాడుకుంటున్నారు. గీత నన్ను చూసి "అవును, మీ ఇద్దరి పేర్లు రాజు అవ్వడం భలే వింతగా ఉంది కదూ! అయినా, నువ్వు పెద్దాయన అని ఎందుకు పిలుస్తావు, సరదాగా "రాజు రాజు" అని ఇద్దరినీ ఇద్దరూ పిలుచుకోవచ్చు కదూ! చిన రాజు, పెద రాజు" అని అంది.
"హా, అలా పిలవచ్చు అనుకో, గాని ఎందుకో నేను రాజు అని పిలిస్తే నన్ను నేను పిలుచుకున్నట్టు అనిపిస్తుంది" అని అన్నాను.
దానికి పెద్దాయన మొహంలో ఒక్కసారి నవ్వు ఆగిపోయింది.
"ఏం పెద్దాయన, ఏమైంది? ఏమైనా తప్పుగా అన్నానా"
దానికి పెద్దాయన గొంతు సవరించుకుని, "అహ, ఏమీలేదు. అది వదిలేయ్ గాని, ఇంతకీ గీతకి కాన్పు తేదీ ఎప్పుడిచ్చారు?"
"వచ్చే నెల. అప్పటిదాకా ఉంటావా లేకపోతే మళ్ళా వెళిపోతావా?"
"నేను అయితే ఉండటానికే ప్రయత్నిస్తానులే. ఒక్కసారి గీత బిడ్డని ఎత్తుకోవాలని ఉంది."
"తప్పకుండా. మంచిపేరు కూడా ఏమైనా ఉంటే చెప్పండి. మీరు నా రాజు జీవితానికి చాలా సాయం చేసారని చెప్తూ ఉంటాడు. కాస్త తరుచుగా వస్తూ ఉండండి." అని గీత అంది.
"తప్పకుండానమ్మా"
"అవును పెద్దాయనా, నీకు పెళ్ళయిందా?"
"లేదు. నా కంటూ నా ఇల్లు ఉంది. నా పాటికి నేను ఏదో చేసుకుంటూ ఉంటాను." అని అంటుండగా పెద్దాయన మొహంలో ఏదో ఇబ్బంది కనిపించింది.
"ఏమైంది పెద్దాయన? అంతా బానేవుందా?"
"హా, ఏంలేదు. ఈ ఎండకి అనుకుంటా, కొంచెం నలతగా ఉంది. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోనా?"
"తప్పకుండా" అని గదిలోకి తీసుకెళ్ళాను.
అదే నేను ఆఖరిసారి తనతో మాట్లాడటం. తరువాత పెద్దాయనని ఎంత తట్టినా లేవలేదు. ఆసుపత్రికి తీసుకెళ్ళాము. డాక్టర్లు వారి ప్రయత్నం వారు చేసారు. కానీ లేవలేదు. ఇంకలేవరని తెలిసాక, తన దగ్గరకి వెళ్ళి - తన చేతిని పట్టుకున్నాను. కంటనీరు ఆగలేదు. ఆగనివ్వలేదు.
తరువాత పాప పుట్టింది. అదితి అని పేరు పెట్టాము. పెద్దాయనకి నచ్చుతుందో లేదో తెలీదు. నాకు నచ్చింది. ఆయనకి నచ్చుతుంది అని అనిపించింది.
అలా కొన్నేళ్ళు పాపతో సమయమే తెలియలేదు. తన మొదటి అడుగు, మొదటి మాట, ఇలా చాలా మొదలు చూసాము - మాకు పెద్దగా గుర్తులేని చిన్నతనాన్ని అదితిలో చూసుకుంటూ గడిపేసాము.
ఒకరోజు ఎప్పటిలానే పడుకున్నాను. కానీ పొద్దున లేచేసరికి చుట్టూచీకటి. చుట్టూ ఆకారం ఏమో గుహలాగ ఉంది. కొంతదూరాన వెలుతురు కనిపించింది. ఆ దారి లోంచి నడిచి బయటకి వచ్చాను. ఎదురుగా ఒక కొండ, దానిని ఆనుకుని ఒక చిన్న ఊరు కనిపించింది. అది నేను పుట్టిన ఊరు. నా సొంతూరు.
Comments
Post a Comment