గాజు మహర్షి

ఓ పెద్దాయన ఉదయం పూట నడుచుకుంటూ వెళుతుంటే రోడ్డు మీద ఒక గాజు పెంకు కనిపిస్తుంది. అడ్డంగా ఉందని కాలితో పక్కకి తన్నుదామనుకుంటాడు. కానీ కాలితో తన్నేటప్పటికి ఆ పెంకు ముందుకు జరుగుతుంది. పెద్దాయన అవాక్కవుతాడు.

మళ్ళీ ప్రయత్నిస్తాడు. మరలా తప్పించుకుంటుంది. 'అరె ఏం జరుగుతోంది?' అనుకుంటాడు. చివరికి వంగి చేతితో తీసి పక్కకు పడేసి వెళిపోతాడు.

ఆ సాయంకాలం తన పెరట్లో నీళ్ళు పోస్తుండగా తన కాలికి రాయికి అడ్డం వస్తుంది. ఆ రాయిని చూసి ఆ పెంకు గుర్తొచ్చి నవ్వుకుంటాడు. 

"ఏమిటి నాన్న, నవ్వుతున్నావు?" అని తన కూతురు వెనకాల నుండి అడుగుతుంది.

"హహ ఏమి లేదమ్మా! పొద్దున్న ఒక వింత అనుభవం జరిగింది."

"ఏంటది?"

"ఒక గాజు పెంకుని కాలితో తన్నుదామనుకుంటే దొరకలేదు. ఆఖరికి చేతితో తీస్తే గానీ చిక్కలేదమ్మా"

"అవునా! భలే ఉందే! నిజమేనా?"

"హా! నేను కూడా నమ్మలేపోతున్నా!"

"నాకు దాన్ని చూడాలని ఉంది. మనం రేపు ఇద్దరం వెళ్దామా?"

"లేదులే. బహుశా అది నా భ్రమ అయి ఉండవచ్చు. రేపు నేను వెళ్ళి, అది ఇంకా అక్కడే ఉంటే ఇంకోసారి పరీక్షించి అప్పుడు ఇంటికి తెస్తా"

"సరే నాన్నా"

***

"నాన్నా వచ్చేసారా?"

"హా! నేనొక్కడినే రాలేదు. నాతో పాటు ఎవరొచ్చారో చూడు.." అంటూ చేతిలోంచి ఆ గాజు పెంకుని తీసాడు.

"అరె! అయితే మీరు భ్రమపడలేదా?"

"లేదమ్మా! ఇంగో కింద పెడుతున్నా, కావస్తే తన్ని చూడు." 

పెద్దాయన కూతురు కాలికి అస్సల చిక్కదు ఆ పెంకు. ముందుకి, వెనక్కి, పక్కకి, తప్పించుకుపోతూనే ఉంటుంది.

"నిజమే నాన్న! ఏదో మాయలా ఉందే!" అని ఆ పెంకుని చేతితో తీసి పైన పెడుతుంది.

"హా అవునమ్మా"

కూతురు ఆ పెంకుని క్షుణ్ణంగా పరిశీలిద్దామని దగ్గరికి తీసుకుంటంది. అప్పుడు ఆ పెంకు లోంచి చిన్నగా ఓ శబ్దం వినిపిస్తుంది. "నాన్న ఏదో వినిపిస్తోంది చూడు?"

పెద్దాయన తన చెవిని దగ్గరగా పెడతాడు. "నిజమే! ఏమిటా శబ్దం?"

"ఎవరో ఏదో మంత్రం చెప్తున్నట్టు ఉంది" 

"అవునా!"

"నాకు దగ్గరగా మాట్లాడకండి." అని ఒక స్వరం గట్టిగా వినిపించేసరికి ఇద్దరూ అవాక్కవుతారు. కూతురు ఆ పెంకుని కింద పడేస్తుంది.

"నాన్న ఎవరు మాట్లాడేది? కొంపతీసి ఆ గాజు కాదు కదా"

"నేనే, మాట్లాడేది." అని ఆ పెంకు లోంచి గంభీరంగా వినబడుతుంది.

కూతురు ఆ పెంకుని తీసి పైన పెడుతుంది.

"మీరు ఎవరు? మీ గొంతు బట్టి పెద్దవారిలా అనిపిస్తున్నారు?" అని పెద్దాయన అడుగుతాడు.

"నేను గాజు మహర్షిని."

"ఏంటి?" అని తండ్రికూతుళ్ళు ఇద్దరూ ఒకే గొంతుతో అడుగుతారు.

"మేమెప్పుడు వినలేదే?"

"అవును. నేను అందరికీ తెలీను."

"కాస్త మీ గురించి చెప్పండి. మేము మీకు ఏ విధంగా సాయం చెయ్యగలము?"

"నేను పుట్టి కొన్ని వందల ఏళ్ళు అయింది. నేను పుట్టినప్పుడు చాలా అందమైన పాత్రని. నన్ను ఒక కుటుంబం దగ్గరకి తీసుకుంది. మొదట్లో నన్ను చాలా అపురూపంగా చూసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏదో గొడవ వస్తే వాళ్ళ కోపానికి నన్ను ముక్కలు చేసారు. కొన్ని రోజులకి వాళ్ళ కోపం తగ్గి మామూలుగా అయిపోయారు. కానీ నేను ముక్కగానే మిగిలిపోయాను. నన్ను చూస్తే ఆ పాత గొడవ గుర్తొస్తోందని చెత్తలో పడేసారు. 

చాలా కాలం అగాధంలో ఎక్కడ ఉన్నానో తెలీక మధనపడ్డాను. నెమ్మదిగా నాకు చాలా మంది తోడు వచ్చారు. నా తోటి వాళ్ళు అందరకీ ఒకటే బాధ - మనుషులు మాకు తగిన గౌరవం ఇవ్వకపోవడం, వాళ్ళ కోపాల్ని, కక్షల్ని మా మీద తీర్చుకోవడం - మానవత్వం ఉన్నవాళ్ళే అలా చేస్తే ఎలా అని అనుకునే వాళ్ళం.

ఇలాంటి దుస్ధితి ఎవరికీ రాకూడదని నిర్ణయించుకున్నా. వెంటనే ఘోర తపస్సుని మొదలుపెట్టాను. కొన్ని ఏళ్ళ క్రిందట దేవుడు ప్రత్యక్షమై నన్ను మహర్షిగా గుర్తించాడు. అలానే నన్ను ఎవరూ కాలితో తన్నలేరు అని, ఆవేశంలో ఉన్నప్పుడు నన్ను ముట్టుకోలేరు అని వరమిచ్చాడు. కానీ నేను ఆ వరాన్ని మా వాళ్ళందరికీ కావాలని అడిగాను. దానికి ఇంకొన్ని ఏళ్ళు తపస్సు చేయాలని చెప్పి అదృశ్యమయ్యాడు. నేనా పనిలో ఉన్నా." అని తన కథని ముగించాడు.

పెద్దాయనకి, తన కూతురుకి నోటి మాట రాలేదు. తమకి తెలియకుండా ఇంత జరుగుతోందా అని అనుకున్నారు. 

ఇంతలో ఆ ముని - "అయినా, నేను ఋుషిని అయినందుకు ఏమీ ఆనందంగా లేదు. మనుషులకి కొంచెం కనికరం, కరుణ ఉంటే నాకింత పని పడేదీ కాదు. నా జీవితాన్ని హాయిగా నాకు నచ్చిన పని చేసుకుంటూ గడిపేవాడిని. దయచేసి నాకొక సాయం చెయ్యండి - నా తపస్సుకి ఏ మాత్రం భంగం కలగకుండా చూసుకోండి." 

ఆ గాజు పెంకుని జాగ్రత్తగా వాళ్ళ దేవుడి గదిలో పెట్టారు. ఇకనుంచి అన్ని సామాన్లని జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు.

***

Comments

Popular posts from this blog

పావు జీవితపు శుభాకాంక్షలు!

చిట్టి చేప

నేను - వాళ్ళు